అమ్మాయిల వీడియోలు తీసి, తప్పించుకునే ప్రయత్నంలో యువకుడి మృతి

  • సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • స్నేహితుడి ఫ్లాట్‌కు వెళ్లి మద్యం తాగిన దిలీప్
  • అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో సిగరెట్ తాగేందుకు భవనం పైకి 
  • మూడో అంతస్తులోని అమ్మాయిల వీడియో తీసిన వైనం
  • పక్క భవనంపైకి ఉరుకుతూ కింద పడి మృతి  
యువతుల వీడియోలు తీసి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పైనుంచి కిందపడి మరణించాడో యువకుడు. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన దిలీప్ (24), సికింద్రాబాద్ సమీపంలోని బౌద్ధనగర్‌లో ఉంటున్న సాయితేజ స్నేహితులు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో సాయితేజ ఫ్లాట్‌కు దిలీప్ వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం సాయితేజ నిద్రపోగా, రాత్రి 1.15 గంటల సమయంలో సిగరెట్ తాగేందుకు దిలీప్ బిల్డింగ్ పైకి వెళ్లాలని అనుకున్నాడు. 

ఈ క్రమంలో మెట్లపై నుంచి వెళ్తుండగా మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో ఉన్న అమ్మాయిల్లో ఒకరు చదువుకుంటుండగా, మరో యువతి నిద్రపోతోంది. గమనించిన దిలీప్ వారిని వీడియో తీశాడు. చదువుకుంటున్న అమ్మాయి గమనించి వెంటనే అప్రమత్తమైంది. కింద గణేశ్ మండపంలో ఉన్న తన మిత్రుడు ఉమేశ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు తన స్నేహితులతో కలిసి భవనంపైకి వెళ్లాడు. గమనించిన దిలీప్ తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న భవనంపైకి దూకే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన దిలీప్‌ను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు దిలీప్‌ను తొలుత గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. అయితే, ఆ తర్వాత ఆరా తీస్తే సాయితేజకు అతడు స్నేహితుడని తేలింది. నిద్రపోతున్న అతడిని లేపి విషయం చెప్పడంతో అతడు షాకయ్యాడు.

Hyderabad
Secunderabad
Crime News

More Telugu News